రాష్ట్రాల గొంతు అణచివేసే యంత్రాంగంలా డీలిమిటేషన్ మారొద్దు : కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ 

రాష్ట్రాల గొంతు అణచివేసే యంత్రాంగంలా డీలిమిటేషన్ మారొద్దు : కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ 

న్యూఢిల్లీ, వెలుగు: జాతీయ అభివృద్ధి లక్ష్యాలను విజయవంతంగా సాధించిన రాష్ట్రాల గొంతును అణచివేసే యంత్రాంగంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మారకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. కేంద్రం చెబుతోన్న 50 శాతం పెంపు అనే ప్రతిపాదన ఎలాంటి రక్షణను ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇటీవల డీలిమిటేషన్‌‌ను సమర్థిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై శశిథరూర్ స్పందించారు.

‘‘చంద్రబాబు .. ఒక చిన్న ఆలోచనా ప్రయోగం చేద్దాం. ఉదాహరణకు మీ జీతం రూ.2 లక్షలు, మీ డ్రైవర్ జీతం రూ.20 వేలు అనుకుందాం. మీరు అందరికీ సమానంగా 50% జీతాల పెంపును ప్రకటించారు. ఈ లెక్కన ఇప్పుడు మీ జీతం రూ.3 లక్షలు.. మీ డ్రైవర్ జీతం రూ.30 వేలు. శాతం లేదా దామాషా పరంగా చూస్తే ఇద్దరికీ పెరిగింది 50 శాతమే. కానీ, ఆర్థికంగా మీరు మీ డ్రైవర్ కంటే గతంలో కంటే మెరుగైన స్థితిలో లేరా?’’ అని ప్రశ్నించారు.

సరిగ్గా ఇదే సూత్రం డీలిమిటేషన్‌‌లోనూ వర్తిస్తుందని, దీనిపైనే దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఆందోళన చెందుతున్నారన్నారు. 50 శాతం పెంపును లోక్‌‌సభ స్థానాలకు అన్వయిస్తూ.. “ఈరోజు యూపీలో 80 మంది ఎంపీలు, కేరళలో 20 మంది ఎంపీలు ఉన్నారు. రేపు ఆ సంఖ్య యూపీలో 120కి, కేరళలో 30కి పెరిగితే...  వారి మధ్య ఏ తేడా ఉంటుందని మీరు అనుకోవడం లేదా?  దామాషా పరంగా ఎంత తేడా ఉన్నా, రాజకీయ వ్యవస్థలో భారీ వ్యత్యాసం ఉంటుంది’’ అని పేర్కొన్నారు.